జైపూర్, 2026-08-01
జైపూర్ మండల కేంద్రంలో విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నాణ్యతా లోపం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కరెంట్ సరఫరా ప్రారంభం కాకముందే వంగిపోవడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జైపూర్ మండల కేంద్రంలో విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నాణ్యతా లోపం స్థానిక ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. నాసిరకం పనులతో ప్రజాధనాన్ని వృథా చేయడమే కాకుండా, విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలైనా కరెంట్ సరఫరా లేదు: జైపూర్ మండల పోలీస్ స్టేషన్ పక్క వీధిలో దాదాపు మూడు నెలల క్రితం కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అయితే, స్తంభాలు నాటి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ లైనుకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. కనీసం విద్యుత్ వెలుగులు చూడకముందే ఆ స్తంభాలు అష్ట వంకరాలుగా వంగిపోయాయి.
నాసిరకం పనులు – వంగిపోయిన స్తంభాలు: స్తంభాలు వేసేటప్పుడు సరైన పునాది (కాంక్రీట్) వేయకుండా, నాసిరకంగా మట్టి పూడ్చడంతో కొద్దిపాటి వర్షాలకే స్తంభాల చుట్టూ ఉండే మట్టి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆ లైనుకు కరెంట్ రాకముందే స్తంభాలు ప్రమాదకరంగా ఒకవైపునకు వంగిపోయాయి. ఈ స్తంభాలు ఎప్పుడు పక్కనే ఉన్న ఇళ్లపై లేదా దారినపోయే వారిపై పడతాయోనని వీధివాసులు భయాందోళనలు చెందుతున్నారు.
అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు: ఈ విషయమై స్థానికులు కాంట్రాక్టర్‌ను నిలదీయగా "రేపు చేస్తాం.. ఎల్లుండి చేస్తాం" అంటూ నెలలు తరబడి కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై స్థానిక విద్యుత్ శాఖ ఏఈ (AE)కి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అధికారులు కాంట్రాక్టర్‌కు కొమ్ముకాస్తున్నారనే విమర్శలకు తావిస్తోంది.
తక్షణమే చర్యలు తీసుకోవాలి: ప్రమాదం జరగక ముందే ఉన్నతాధికారులు స్పందించి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.











