భీమారం, 01-08-2026
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం, ఓ టాటా సుమో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2.15 లక్షల విలువైన మద్యం పట్టుబడగా, వాహన డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం, ఓ టాటా సుమో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో సుమారు రూ.2.15 లక్షల విలువైన మద్యం పట్టుబడగా, వాహన డ్రైవర్ పరారయ్యాడు.
భీమారం ఎస్సై ఎ.రాజేందర్ తన సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.
ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు, రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి, తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.











