గోదావరిఖని, 2026-08-01
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్నికల హామీని నెరవేరుస్తూ, వీర్లపల్లి గ్రామ ప్రజలకు త్వరలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ ప్రభావంతో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం వీర్లపల్లి గ్రామ ప్రజలతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో వీర్లపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన పునరావాస హామీని తప్పకుండా నెరవేర్చుతానని చెప్పిన మాటను అమలు చేస్తున్నామని తెలిపారు.
ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ ప్రభావంతో వీర్లపల్లి గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం గానీ, ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం గానీ గ్రామానికి పునరావాసం కల్పించే విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో కూడా పలుమార్లు సమావేశమై వీర్లపల్లి గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు.
వీర్లపల్లి గ్రామంలోని 250కి పైగా కుటుంబాలకు ఫ్లాట్లు నిర్మించి అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఫ్లాట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా ఇప్పటికే పరిశీలించినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఫ్లాట్లు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు 21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు కొక్కిరాల శ్రీనివాస్, వీర్లపల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పునరావాస సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.










