మంచిర్యాల జిల్లాలో రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సూచించారు. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో కిసాన్ జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షుల నియామక కార్యక్రమం జరిగింది.
మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ సమక్షంలో మంచిర్యాల జిల్లా కిసాన్ జిల్లా కమిటీ సభ్యులను, మండల అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వారికి రఘునాథ్ వెరబెల్లి, వెంకటేశ్వర్ గౌడ్ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, నూతనంగా నియమితులైన కిసాన్ కమిటీ సభ్యులు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసి, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో రైతులకు అమలు చేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, కిసాన్ జిల్లా అధ్యక్షులు గోపతి రాజయ్య, మధువరపు రమణ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పట్టి వెంకట కృష్ణ, సంజీవ్ రావు, వైద్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.











