ఓటు హక్కును పరిరక్షించుకోవడం అంటే భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమేనని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఆ హక్కును హరించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
నారాయణపేటలో ఓట్ బచావో దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఎలక్టోరల్ రోల్స్ సవరణ ప్రక్రియ పేరుతో కోట్లాది ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, అర్హులైన ఒక్క ఓటరుకూ అన్యాయం జరగకూడదని అన్నారు. బీజేపీ ఓట్ల తొలగింపుపై అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించిందని మంత్రి గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓటు వేయడం కేవలం బాధ్యత మాత్రమే కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో మన గొంతును వినిపించే శక్తి అని పేర్కొన్నారు. ఓటు హక్కు కోల్పోతే ప్రజాస్వామ్యంలో పౌరుడి భాగస్వామ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు.
పేదలు, బడుగు బలహీన వర్గాల ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని మంత్రి ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. దేశంలో అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల సంక్షేమానికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. పేదల హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
ప్రజల ఓటుతో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఓటు హక్కుకు విఘాతం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించనున్న ఓట్ బచావో దేశ్ బచావో నిరసన సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం జరిగే ఈ పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కులగణన చేపట్టి సామాజిక న్యాయం దిశగా ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొనియాడారు.
సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన సమాచారం అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమాన అవకాశాలు, సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. రాబోయే పాలమూరురంగారెడ్డిహైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామా రామ్మోహన్ రెడ్డిని గెలిపించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని మంత్రి శ్రీహరి అన్నారు.
ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడం, కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఏఐసీసీ పరిశీలకులు రవీంద్ర దాస్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











