కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని, ఓట్ల తొలగింపు అనేది అనైతిక చర్య అని రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఆరోపించారు. ఓటు అనేది దేశ పౌరుని హక్కు అని, ఓటును తొలగించే హక్కు ఎవ్వరికీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలోని రంగంపల్లి వద్ద గల గార్డెన్స్ లో ఏఐసీసీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా చేపట్టిన ఓట్ బచావో - దేశ్ బచావో ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు ఎస్. శరత్, టీపీసీసీ పరిశీలకులు కూన శ్రీశైలం గౌడ్, డీసీసీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఎస్.ఐ.ఆర్ పేరుతో చీఫ్ ఎలక్షన్ కమిషన్ మరియు జ్ఞానేశ్ కుమార్ అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా 73 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని ప్రభుత్వ విప్ విజయరమణ రావు ఆరోపించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏ నియోజకవర్గానికి ఎన్ని నీళ్లు వచ్చాయో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ చెప్పాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు అన్నారు. కన్నెపల్లి నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతుందని, ఆ నీటిని మళ్లించవచ్చని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు.











