Mancherial/Jaipur (ప్రజావార్త) జూన్ 29
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. రామగుండం-1 ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం త్వరలో ప్రారంభం కానుంది. దీని ద్వారా కోల్ బెల్ట్ ప్రజలకు అత్యాధునిక గుండె వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
దేశానికి వెలుగులు పంచే కార్మికుల ఆరోగ్య పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు గుండెకాయగా ఉన్న కార్మికుల హృదయాలకు గట్టి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను రామగుండం-1 ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది. ఇది త్వరలో లాంఛనంగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
సింగరేణి కార్మికులకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల నేపథ్యంలో, సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే (దాదాపు 33 వేల మంది) గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి సంస్థ తొలి క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం విశేషం. దీంతో పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నివసిస్తున్న వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత సింగరేణి ఉద్యోగులతో పాటు సమీప గ్రామాల ప్రజల హృదయాలకు సింగరేణి గట్టి భరోసాను ఇచ్చినట్లు అయింది.
గుండె సమస్య నేడు వయోభేదం లేకుండా ప్రతీ ఒక్కరూ ఎదుర్కొంటున్న అతి ప్రాణాంతక జబ్బు. ఇది ఎప్పుడు వస్తుందో అంచనా వేయడం కష్టమే కానీ, ఈ సమస్య తలెత్తిన తొలి గంట అత్యంత కీలకమని వైద్యులు పేర్కొంటారు. దీన్ని 'గోల్డెన్ అవర్'గా పేర్కొంటారు. ఈ సమయంలో సత్వరమే చికిత్స అందించగలిగితే విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కంపెనీ ఆధ్వర్యంలో అనేక ఆధునిక వైద్య సౌకర్యాలు గల ఏరియా ఆసుపత్రులు ఉన్నప్పటికీ, కార్డియాక్ సంబంధిత సేవలు పరిమిత స్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకు గుండెపోటు వచ్చిన రోగులను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి సుదూర నగరాలకు తరలించాల్సి వచ్చేది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో అమూల్యమైన 'గోల్డెన్ అవర్' వృథా అవుతుండేది. ఈ నేపథ్యంలోనే గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను సింగరేణి ఏర్పాటు చేసింది.
గుండెపోటు వచ్చిన తొలి గంట అత్యంత కీలకం. అదే సమయంలో యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందిస్తే రోగి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ అత్యవసర సేవల ప్రాధాన్యతను గుర్తించిన సింగరేణి యాజమాన్యం, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతికతతో ఈ క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. బొగ్గు బెల్ట్ ప్రజలకు సకాలంలో, తక్కువ వ్యవధిలోనే అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కార్మికుల ఆరోగ్యం కోసం సింగరేణి సంస్థ ఏటా 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల రెఫరల్స్ కోసమే అధిక మొత్తం నిధులను కేటాయిస్తోంది. గత ఏడాది మాత్రమే హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సుమారు 3,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను భూపాలపల్లి, బెల్లంపల్లి, రామగుండం, రామకృష్ణాపూర్ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరిగింది. గుండె జబ్బుల విషయంలో ప్రతీ నిమిషం విలువైనదే కావడంతో, లక్షల రూపాయలు వెచ్చించడం కంటే సకాలంలో అత్యాధునిక చికిత్స అందించడం ద్వారానే ప్రాణాలను కాపాడవచ్చనే దృఢ సంకల్పంతో సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మరోమారు కార్మిక సంక్షేమంలో సింగరేణి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఈ ముందడుగు ద్వారా మరోసారి నిరూపించింది.












