మంచిర్యాల జిల్లా నూతన వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తన ప్రథమ కర్తవ్యమని ఆయన తెలిపారు.
డాక్టర్ నరేందర్ రాథోడ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. జిల్లాను ఆరోగ్య సూచికలలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డాక్టర్ రాథోడ్ ఆదేశించారు. ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధుల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ, మున్సిపల్ స్థాయిలలో సహకారం తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ వైద్య సేవలు, అత్యవసర సేవలకు 108 అంబులెన్స్ వినియోగంపై దృష్టి సారించాలని, జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ, టీకాల కార్యక్రమం, అసంక్రమణ వ్యాధుల నియంత్రణ వంటి జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే వెంటనే కార్యాలయానికి తెలియజేయాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

