ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా వివిధ జిల్లా శాఖల సభ్యులకు, సంస్థలకు అవార్డులు అందజేశారు.
వ్యక్తిగత విభాగంలో అత్యధికంగా 1101 మంది రక్తదాతలను సమకూర్చినందుకు గాను కీ.శే. కొక్కిరాల రఘుపతి రావు ఛారిటబుల్ ట్రస్ట్, మంచిర్యాల అవార్డును అందుకుంది. సంస్థాగత పరంగా అత్యధికంగా 246 మంది రక్తదాతలను సమకూర్చిన సింగరేణి ఫవర్ ప్లాంట్, జైపూర్ కు కూడా అవార్డు దక్కింది.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల రక్త నిధి కేంద్రం, స్వచ్ఛంద రక్తదాతలు, సేవా సంస్థల సహకారంతో 91 శిబిరాలలో 6016 యూనిట్ల రక్తాన్ని సేకరించి, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక రక్త నిల్వలను సేకరించినందుకు రెండవ స్థాయి అవార్డును పొందింది. ఈ అవార్డును గవర్నర్ తో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు.
రక్తదానంలో విశేష కృషి చేసిన వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రెడ్ క్రాస్ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.











