రైతు పేరుతో సామాన్య ప్రజలపై భారం మోపడం సరికాదని, పాల ధరను లీటరుకు 100 రూపాయలకు పెంచడం పరిష్కారం కాదని ప్రజా జాగృతి సమితి అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతె తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాడి రైతుల కష్టాలు ప్రజలందరికీ తెలుసని, పశువుల దాణా, వైద్యం, నిర్వహణ ఖర్చులు పెరిగినందుకు రైతుకు తగిన గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందేనని రాజలింగు మోతె అన్నారు. అయితే, ఆ భారాన్ని మొత్తం వినియోగదారుడిపైకి నెట్టడం మాత్రం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. లీటరు పాల ధరను 100 రూపాయలకు పెంచాలనే నిర్ణయం పాడి రైతులకు ఎంత ప్రయోజనం కలిగిస్తుందో కానీ, ఆ అదనపు రూపాయలలో రైతు చేతికి నిజంగా ఎంత చేరుతుందో మాత్రం తెలియదని రాజలింగు మోతె అన్నారు. ధర పెంపుపై స్పష్టమైన లెక్కలు ప్రజలకు వెల్లడించారా అని ఆయన ప్రశ్నించారు.
పాలు నిత్యావసర వస్తువని, చిన్న పిల్లలు, వృద్ధులు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు ప్రతిరోజూ పాలపై ఆధారపడుతున్నాయని తెలిపారు. ధరను భారీగా పెంచితే నెలవారీ కుటుంబ ఖర్చు మరింత పెరుగుతుందని, రైతుకు న్యాయం జరగాలి కానీ ప్రజలకు భారం కాకూడదని ఆయన అన్నారు. పాడి రైతులను ఆదుకోవాలంటే ప్రభుత్వం పశువుల దాణాపై సబ్సిడీ ఇవ్వాలని, పశువైద్య సేవలను బలోపేతం చేయాలని రాజలింగు మోతె సూచించారు. రైతుకు నేరుగా గిట్టుబాటు ధర కల్పించాలని, పాల సేకరణ, రవాణా, మధ్యవర్తిత్వ ఖర్చులను పారదర్శకంగా వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ధర పెంపుపై రైతులు, వినియోగదారులతో సంప్రదింపులు జరపాలని, రైతు బతకాలి, వినియోగదారుడూ బతకాలని ఆయన అన్నారు. రైతు సమస్యకు పరిష్కారం పేరుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపడం సరికాదని, ప్రభుత్వం సమర్థవంతమైన ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 100 రూపాయల పాల ధర నిర్ణయంపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, ధర పెంపుపై పూర్తి లెక్కలు ప్రజల ముందుంచాలని కోరారు. ఈ సమావేశంలో సమితి సభ్యులు తాండూరి రాజేష్, కుక్కముడి శ్రీకాంత్ లు పాల్గొన్నారు.












