క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని అమరవాది చెరువు పూడికతీత పనులు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తియితే రైతులకు సాగునీటి సమస్య పరిష్కారమై, మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో గల అమరవాది చెరువు పూడికతీత పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ ఈ పనులను ప్రారంభించారు. ఈ చెరువు పూడికతో నిండిపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో చెరువులో నీటి నిల్వ లేకపోవడం వల్ల పంటల సాగు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోయారని, చేపల ఉత్పత్తి తగ్గి మత్స్యకారుల జీవనోపాధి కూడా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం స్థానికులు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని, అయితే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో రూ.12.69 లక్షలు మంజూరు చేయించి, సుమారు 9200 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తొలగించే పనులకు చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.
మొదటి విడత పనులు పూర్తయినా, చెరువులో పూర్తిస్థాయిలో పూడిక తొలగింపు జరగకపోవడంతో, స్థానిక కౌన్సిలర్ దాముక శిరీష ప్రజల ఇబ్బందులను మరోసారి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, రెండవ విడత పూడికతీత పనులకు కూడా అనుమతులు మంజూరు చేయించి పనులు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ పనులు పూర్తయితే చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, రైతులకు సాగునీటి సమస్య చాలావరకు పరిష్కారమవుతుందని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, మత్స్యకారుల జీవనోపాధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
అమరవాది చెరువు పూడికతీత పనులు పూర్తయితే భవిష్యత్తులో రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాల స్థాయి పెరిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మత్స్యకారులకు చేపల పెంపకం ద్వారా తిరిగి ఉపాధి అవకాశాలు లభించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మునిసిపాలిటీ కౌన్సిలర్ దాముక శిరీష, మాజీ పట్టణాధ్యక్షులు పల్లె రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల వేణు, యువనాయకులు దాముక రమేష్, మత్స్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.












