రంగారెడ్డి, 2026-08-21
ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై రాజేంద్ర నగర్ లో ఒక వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసిరి సీతక్క, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, వ్యవసాయ, పంచాయతీ రాజ్, పశు సంవర్ధక మత్స్య శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై రాజేంద్ర నగర్ లో ఒక వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసిరి సీతక్క, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, వ్యవసాయ, పంచాయతీ రాజ్, పశు సంవర్ధక మత్స్య శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, గతంలో కూడా దేశంలో ఎల్ నినో ప్రభావాలు వచ్చాయని, 1951 నుంచి నేటి వరకు 12సార్లు ఎల్ నినోను భారత దేశం ఎదుర్కొందని తెలిపారు. కరువును ఎలా ఎదుర్కోవాలనే అవగాహన రైతులకు ఉంటుందని, అయితే ఆ అవగాహనను ఆచరణలో పెట్టేలా చేసే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. పంటల మార్పిడి ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావచ్చనే విషయంలో రైతులకు సలహాలు ఇవ్వాలని సూచించారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందస్తు కార్యాచరణ ద్వారా ఎల్ నినోను సమర్థవంతంగా అధిగమించాయని గుర్తు చేశారు.
పశు సంపద పెంపుపై దృష్టి
కరవు పరిస్థితుల్లో పశువుల పెంపకం, సంరక్షణ వంటి వాటిపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. చేపల పెంపకానికి నీరు తప్పనిసరి అని, చెరువుల్లో చేపల పెంపకం జరగాలంటే అక్కడ ఉన్న రైతుల నుంచి నీటి సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. మేకలు, గొర్రెలు మేసేందుకు ప్రత్యేక ప్రదేశాలను గుర్తించి, కేటాయించడం ద్వారా పశు సంపదను పెంచుకోవచ్చని తెలిపారు. ఎల్ నినో వంటి వాటిని ఎదుర్కోనేందుకు అధికారులు అప్రమత్తతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని సంపూర్ణం చేయాలని సూచించారు.
ప్రభుత్వ చర్యలు కీలకం
ఎల్ నినో విషయంలో దేశంలోనే తెలంగాణ మాత్రమే ఇలాంటి ముందస్తు కార్యక్రమం చేపట్టడం హర్షించదగ్గ విషయమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఎలాంటి కరవు పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు సాగేవాడు రైతు అని, పంటల దిగుబడి రాకున్నా వ్యవసాయాన్ని మాత్రం వదలడని అన్నారు. అటువంటి రైతుకు ప్రభుత్వం అండగా నిలవాలని, భరోసా కల్పించాలని కోరారు. రైతులను కరువు నుంచి బయట పడవేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని తెలిపారు. వర్షాల ద్వారా వచ్చే నీటిని చెక్ డ్యాంలను నిర్మించి నీటిని నిల్వ చేసి వ్యవసాయ రంగానికి వాడుకోవాలని సూచించారు. మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తెలంగాణను ఒక మోడల్ గా నిలుపవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళికతో రైతులకు మంచి అవకాశం కల్పించి ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.












