Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 16
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు సంచలనం సృష్టించారు. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు లక్ష్మణ్ మృతికి కారణమైన ఆర్టీసీ బస్సును, దాని డ్రైవర్ను సీసీ కెమెరాల సహాయంతో గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు వివరాలను జైపూర్ ఎస్సై భూమేష్ వెల్లడించారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ కేసును జైపూర్ పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో ఛేదించారు. ఈ కేసులో మృతి చెందిన హోంగార్డు లక్ష్మణ్ కేసులో ఆర్టీసీ బస్సు, డ్రైవర్ను గుర్తించారు.
వివరాల్లోకి వెళితే, ఈ నెల 11న రామగుండం కమిషనరేట్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్, తన విధులను ముగించుకొని ఇంటికి వస్తుండగా నజీర్పల్లి పైవంతెన వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమించి, శుక్రవారం రాత్రి ఆయన మృతి చెందారు.
కేసు నమోదు చేసుకున్న జైపూర్ పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ భూమేష్ లతో కూడిన ప్రత్యేక బృందం సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది.
దర్యాప్తులో భాగంగా, ప్రమాదానికి కారణమైన వాహనం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన TS20 Z 0012 నంబర్ గల ఆర్టీసీ బస్సు అని, బస్సు డ్రైవర్ బెజ్జూర్కు చెందిన జంగిటి రాజేశ్ అని గుర్తించారు. జంగిటి రాజేశ్ ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు, ప్రమాద సమయంలో బస్సు ఆసిఫాబాద్ నుంచి గోదావరిఖని వైపు ప్రయాణిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. విచారణలో భాగంగా తన తప్పిదాన్ని డ్రైవర్ ఒప్పుకున్నట్లు జైపూర్ ఎస్సై భూమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.












