మంచేరియల్, జూలై 29, 2026
జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్ లో జరిగిన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నివారణ, నియంత్రణ చర్యలను పటిష్టం చేయడంతో పాటు స్క్రీనింగ్ సేవలను విస్తృతం చేయాలని సూచించారు.
జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేంద్ర రాథోడ్, ఎయిడ్స్ కోఆర్డినేటర్ నీలిమ లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేసి, జిల్లాలో స్క్రీనింగ్ సేవలను విస్తృత స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో బహుళ రంగాల కార్యాచరణ వ్యూహం లక్ష్యాలను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని సూచించారు.
చికిత్స పరిధిలోకి రాని హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించడంతో పాటు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాలలో స్వీయ ప్రమాద అంచనా క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి స్వచ్ఛంద పరీక్షలను ప్రోత్సహించాలని, తద్వారా ప్రజలు ప్రమాదాన్ని అంచనా వేసుకుని సమీపంలోని పరీక్షా కేంద్రాలకు స్వయంగా వెళ్తారని తెలిపారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్మికులు, అధిక ప్రమాదం ఉన్న కార్మిక వర్గాల కోసం ప్రత్యేక ఆరోగ్య, హెచ్ఐవి స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. సామాజిక సంరక్షణ, మద్దతు, భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
హెచ్ఐవి బాధితుల సంక్షేమానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులు సంబంధిత ఆన్లైన్ పోర్టల్ల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఎయిడ్స్ బాధితుల సహాయార్థం, ప్రజల సౌకర్యం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1097 ఏర్పాటు చేయడం జరిగిందని, సందేహాల నివృత్తి, సమాచారం కొరకు సంప్రదించవచ్చని తెలిపారు.
అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జిల్లాలో హెచ్ఐవి నియంత్రణ చర్యల పురోగతిని వివరించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా చెన్నూర్ లో నూతన ఐసీటీసీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐసీటీసీ కౌన్సిలర్లు, లింక్ ఆర్ట్ సెంటర్ సిబ్బంది, హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ ప్రతినిధులు పాల్గొన్నారు.












