పెద్దపల్లి, 2026-07-28
పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండేళ్లలో రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు అందించబడ్డాయని, రూ.52 కోట్లతో ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యంతో ఆధునీకరించే పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించి, ప్రతి వార్డును కలియతిరుగుతూ వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 131 కోట్ల విలువైన వైద్య సేవలను అందించినట్లు తెలిపారు. ఆసుపత్రికి సంబంధించి రూ.40 లక్షల వ్యయంతో వివిధ విభాగాలకు అత్యధునిక పరికరాలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. కంటి శుక్లలు, ఊపిరితిత్తుల సామర్థ్యం, పంటి రూట్ కెనాల్, మోకాళ్ళ కీళ్ల మార్పిడి, ఎక్స్‌రే ఇమేజింగ్, నడుము-మెడ నొప్పుల నివారణ, మోకాలు గుజ్జు అరగకుండా చేసే పరికరాలు, చెవి వినికిడి సామర్థ్యం, చెవి-ముక్కు-గొంతు పరీక్ష యంత్రాలు, చర్మ వ్యాధుల పరీక్షకు డేర్మ చైర్, చిన్న పులిపిర్లు తొలగించే కాటన్ యంత్రం వంటివి సమకూర్చినట్లు వివరించారు.
గత సంవత్సర కాలంలో దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో 10 వార్మర్లు, 7 ఫోటో థెరపీ యూనిట్లు, 2 సిపాపు, 1 వెంటిలేటర్‌తో SNCU ను ప్రారంభించి, 990 మంది నవజాత శిశువులకు దాదాపు 9 కోట్ల రూపాయల వరకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సహకారంతో SNCU లో నవజాత శిశువులకు సేవలు అందించేందుకు కరీంనగర్లో కొంతమంది సిబ్బందికి శిక్షణ ఇప్పించి, ఏడాది కాలంగా జీతాలు చెల్లిస్తూ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఆసుపత్రికి 20 లక్షల రూపాయల వ్యయంతో నూతన ఆంబులెన్స్‌ను కూడా అందించినట్లు తెలిపారు.
గత రెండేళ్లలో దాదాపు 2081 మందికి ఆర్థో సర్జరీలు (రూ.10.40 కోట్లు), 6478 మందికి జనరల్ సర్జరీలు (రూ.32.38 కోట్లు) చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో దంత వైద్యానికి సంబంధించి 216 సర్జరీలు (రూ.21.60 లక్షలు), 3096 కంటి శుక్లాల సర్జరీలు (రూ.94.98 లక్షలు) జరిగాయని తెలిపారు. 40,923 UGS స్కానింగ్‌లు (రూ.4.09 కోట్లు), 2355 టూడికో పరీక్షలు (రూ.47.10 లక్షలు), 32,038 ECG పరీక్షలు (రూ.1.13 కోట్లు) నిర్వహించినట్లు వివరించారు. ల్యాబ్ టెస్టులు, ఫిజియోథెరపీ వంటి సేవలతో పాటు 5067 డెలివరీలు (రూ.25.33 కోట్లు) జరిగినట్లు తెలిపారు.
ల్యాప్కోస్కోపీ (24 సర్జరీలు), ఆర్థోస్కోప్ (3 సర్జరీలు), యూరాలజీ (3 సర్జరీలు) వంటి అధునాతన సర్జరీలు కూడా జరిగాయని, వీటికి 33 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో 5,12,290 మందికి మందులు (రూ.25.60 కోట్లు) అందించినట్లు, మొత్తం మీద ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు 131 కోట్ల 62 లక్షల 68 వేల రూపాయల విలువైన వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం సరైన వైద్య సేవలు లేక పేషెంట్లు ఇబ్బందులు పడ్డారని, కానీ ఇప్పుడు ఆసుపత్రి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు.












