మంచేరియల్, 2026-06-30
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచడంలో, హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (సిటియు) బెల్లంపల్లి రిజియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దళిత, బహుజన కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసింది.
రాజ్యాంగ హాక్కులను కాలరాస్తూ, దళిత, బహుజన కార్మికవర్గానికి వేతనాల పెంపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (సిటియు) బెల్లంపల్లి రిజియనల్ కమిటీ ఆరోపించింది. గెలిచిన నెల రోజుల్లోనే కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తామని చెప్పిన పాలకుల హామీ ఏమైందని ప్రశ్నించింది. డాక్టర్ బీ.ఆర్. అంబెడ్కర్ రాజ్యాంగంలో కార్మిక వర్గానికి కల్పించిన హక్కుల కోసం, వేతనాల పెంపుదలకై రాజకీయ చైతన్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది.
ఈరోజు శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి ఓ సి పి లో కాంట్రాక్టు కార్మికుల జనరల్ బాడీ సమావేశం కాసీపేట రాజేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచడంలో లేదా కోలిండియాలో 2013లో ఒప్పందమైన హై పవర్ కమిటీ వేతనాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. డాక్టర్ బీ.ఆర్. అంబెడ్కర్ రాజ్యాంగంలో చెప్పిన సమానత్వం, గౌరవం వంటి పదాలను కాంట్రాక్టు కార్మికుల విషయంలో వర్తింపజేయడం లేదని, వారిని చులకన భావంతో చూస్తున్నాయని మండిపడ్డారు.
గత, ప్రస్తుత పాలకులు కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దుచేసి, పర్మినెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇప్పిస్తామని, సింగరేణిలో హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామని బహిరంగంగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తకపోవడం కార్మికులను మోసం చేయడమేనని, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన నెల రోజుల్లో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామని చెప్పి మూడు సంవత్సరాలు దాటినా హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారంతా దళితులు, బహుజనులేనని, వీరి పట్ల వ్యవస్థలో, శ్రమలో వివక్ష చూపడం అంబెడ్కర్ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుపై స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోతే దళిత, బహుజన కార్మికులందరూ రాజకీయ చైతన్యంతో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SCKIS-CTU డివిజన్ అధ్యక్షులు కాసీపేట రాజేశం, కన్వేయన్స్ డ్రైవర్స్ యూనియన్ (సిటియు) కార్యదర్శి సంపత్ రావు, నాయకులు రాజలింగు, సంపత్, సతీష్, సమ్మయ్య, శీను, నరేష్, హుస్సేన్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.











