మంచేరియల్, జూన్ 30, 2026
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. చెన్నూర్ మండల కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణాన్ని పరిశీలించారు.
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యలలో భాగంగా చెన్నూరు మండల కేంద్రంలో చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను సందర్శించారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుందని, ఈ క్రమంలో చెన్నూర్ మండల కేంద్రంలో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ తో కలిసి మునిసిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంక్ నిర్మాణం, పైప్ లైన్ల పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఫిజిక్స్ సబ్జెక్టులో విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. అనంతరం చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 3, 4, 11 వార్డులలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను మండల తహసిల్దార్ మల్లికార్జున్ తో కలిసి పరిశీలించారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి అర్హులైన ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, పూరించిన తర్వాత సేకరించాలని, ఫారాల పంపిణీ ప్రక్రియను జూలై 1వ తేదీ నాటికి పూర్తి చేసి ప్రతి రోజూ పురోగతి నివేదికలను సమర్పించాలని తెలిపారు.










