మంచేరియల్, 2026-06-29
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత కార్యాచరణ ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో, జూలై 24 వరకు ఇంటింటి సర్వే, ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈ.ఆర్.ఓ.లు, ఎ.ఈ.ఆర్.ఓ.లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
నిర్దేశిత కార్యాచరణ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, వివరాల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించి, ప్రతి అర్హులైన ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, పూరించిన తర్వాత సేకరించాలని సూచించారు. ఫారాల పంపిణీ ప్రక్రియను జూలై 1వ తేదీ నాటికి పూర్తి చేసి, ప్రతి రోజూ పురోగతి నివేదికలను సమర్పించాలని తెలిపారు.
ప్రతి బూత్ స్థాయి అధికారి తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించి, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదై ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు కావడం చట్టరీత్యా శిక్షార్హమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పేర్లు, ఇంటిపేర్లు, మహిళల వివాహానంతర ఇంటిపేరు మార్పులు వంటి వ్యత్యాసాలను పరిశీలించి, వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ, బూత్ స్థాయి అధికారుల జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లతో తరచూ సమావేశాలు నిర్వహించి, ఓటరు జాబితాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రతి శనివారం జిల్లా స్థాయిలో, ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు బి.ఎల్.ఓ. యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని, ఎం.ఎస్.ఎస్. వాలంటీర్లు, ఎం.సి.సి. క్యాడెట్లు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గిరిజన, సరిహద్దు ప్రాంతాలలో స్థానిక భాష తెలిసిన హెల్పింగ్ హ్యాండ్స్‌ను నియమించాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించిన అనంతరం ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ పూర్తయిన స్టిక్కర్‌ను ప్రతి ఇంటికి అతికించాలని, ఫారాల పూరణ, సమర్పణపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రతి ఈ.ఆర్.ఓ., ఎ.ఈ.ఆర్.ఓ. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పనులను పర్యవేక్షించి, ప్రతి ఎన్యూమరేషన్ ఫారంపై సంబంధిత ఓటరు సంతకం ఉండేలా బూత్ స్థాయి అధికారులు నిర్ధారించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విధుల సమయంలో ప్రతి బూత్ స్థాయి అధికారి తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించాలని, కొత్తగా నియమితులైన బూత్ స్థాయి అధికారులకు సంబంధిత ఈ.ఆర్.ఓ.లు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.











