మంచేరియల్, 09-07-2026
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్‌లోని మాదారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. గిరిజనులకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలని, ఆధునిక సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలని ఆయన అధికారులకు సూచించారు. స్టేషన్ నిర్వహణ, పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్‌లోని మాదారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు మంచిర్యాల జోన్ డీసీపీ ఎ.భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, ఎస్ఐ సౌజన్య పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గౌరవ వందనాన్ని పోలీస్ కమిషనర్ స్వీకరించారు.
స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్రీడా ప్రాంగణం, పోలీస్ వాహనాల నిర్వహణను ఆయన పరిశీలించారు. ప్రతి పోలీస్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, తాళ్లు, ట్రాఫిక్ కోన్స్, క్రైమ్ ప్రొటెక్షన్ రిబ్బన్, రైట్ గేర్ కిట్ (హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ప్రొటెక్టర్) తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లోని కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును పరిశీలించి, కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తత, స్పందన తీరును కమ్యూనికేషన్ సెట్ ద్వారా తెలుసుకున్నారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలను, పెండింగ్ కేసులను ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులు, ఎదురవుతున్న సమస్యల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, విస్తారమైన గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు సేవలందిస్తున్న మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు మరింత స్నేహపూర్వకంగా, అందుబాటులో ఉండే పోలీసింగ్ అందించాలని సూచించారు. గిరిజనులతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని విశ్వాసాన్ని పెంపొందించాలని ఆదేశించారు.
పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక సేవలు, సీసీటీఎన్ఎస్, హాక్ ఐ, టీఎస్ కాప్ వంటి యాప్‌లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. పాస్‌పోర్ట్ ధృవీకరణ, వివిధ ధ్రువపత్రాల జారీ, ఫిర్యాదుల స్వీకరణ వంటి ఆన్లైన్ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు చేపడుతున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యంతో అమలు చేయాలని సూచించారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రయోజనాలు, సైబర్ నేరాల నివారణ, రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్ ఎస్ఐలు తమ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్, ఆకస్మిక వాహన తనిఖీలు నిరంతరం నిర్వహించి నేరాల నియంత్రణతో పాటు ముందస్తు సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక (ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్) సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.












