మంచేరియల్, July 8, 2026
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం నెన్నెల, మందమర్రి మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ స్థాయి అధికారులకు సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం జిల్లాలోని నెన్నెల మండల కేంద్రం, మందమర్రి పట్టణంలోని జోన్ 1, 2 లను ఆయా మండలాల తహసిల్దార్లతో కలిసి సందర్శించి బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం జరిగిందని, పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాల వివరాలు నమోదు చేసిన తర్వాత తిరిగి తీసుకుని డిజిటలైజ్ చేయాలని తెలిపారు. వాలంటీర్లు, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్ల సహాయంతో ఎన్యూమరేషన్ ఫారాలలో వివరాల నమోదు ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు.
అనంతరం మందమర్రి, నెన్నెల, బెల్లంపల్లి మండలాల తహసిల్దార్ కార్యాలయాలను బి సెక్షన్ సూపరింటెండెంట్ తో కలిసి సందర్శించి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ వేగవంతం, భూ సేకరణ సంబంధిత అంశాలపై కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎస్.ఐ.ఆర్. ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలు నమోదు చేసిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 మంది ఓటర్లకు మించకుండా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రణాళిక ప్రకారం చేపట్టాలని తెలిపారు.
సాదాబైనమా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, విరాసత్ ఇతర సేవలను, భూ సంబంధిత సేవలను నిబంధనల ప్రకారం వేగవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కరణ వేగవంతం చేయాలని, సర్టిఫికెట్లను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తెలిపారు. కార్యాలయ సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసిల్దారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











