జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు తెలిపారు. సర్వర్ సమస్యలను ఈ-పాస్ ఇంజనీర్లు పరిష్కరిస్తున్నారని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలోని రేషన్ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో అక్కడక్కడా సర్వర్ సంబంధిత సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ, ఈ-పాస్ ఇంజనీర్లు వాటిని వెంటనే పరిష్కరించి పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో సన్నబియ్యం నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నందున ప్రతి అర్హులైన రేషన్ కార్డుదారునికి సన్నబియ్యం తప్పనిసరిగా అందించడం జరుగుతుందని తెలిపారు.
సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతుందని, రేషన్ కార్డుదారులు తొందరపడకుండా, తమకు అనుకూలమైన సమయంలో సంబంధిత రేషన్ దుకాణానికి వెళ్లి సన్నబియ్యాన్ని తీసుకోవచ్చని సూచించారు. పంపిణీ కార్యక్రమాన్ని మండల స్థాయిలో సంబంధిత మండల తహసీల్దార్లు, జిల్లా స్థాయిలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు.
జిల్లాలో ప్రస్తుతం 2 లక్షల 57 వేల 251 రేషన్ కార్డులు ఉన్నాయని, అర్హులైన ప్రతి కార్డుదారునికి 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణాల డీలర్లు, రేషన్ కార్డుదారులు అక్రమంగా పక్కదారి మళ్లించి విక్రయించినట్లయితే తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ (నియంత్రణ) ఆర్డర్–2016లోని సెక్షన్ 17(డి) ప్రకారం సంబంధిత రేషన్ డీలర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుందని హెచ్చరించారు. రేషన్ కార్డుదారులు రేషన్ బియ్యాన్ని విక్రయించినట్లయితే వారి రేషన్ కార్డు రద్దు చేయడంతో పాటు వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు.









