Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 30
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో, రోడ్లపైకి నీరు చేరడంతో కొన్ని ప్రాంతాలను మూసివేశారు. జిల్లాలో వరద ప్రవాహం అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు సూచనలు జారీ చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి ప్రవహించడంతో, రోడ్లపైకి నీరు చేరింది. దీంతో కొన్ని ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. జిల్లాలో వరద ప్రవాహం అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జైపూర్ ఎస్ఐ భూమేష్ మాట్లాడుతూ, భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు, నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉందని, ఆయా ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదని సూచించారు.
వర్షం నీటి వల్ల రోడ్లపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు గోదావరి నది, చెరువుల వద్ద సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అలాగే విద్యుత్ పరికరాలు, పోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయడానికి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా డయల్ 100కి లేదా స్థానిక పోలీస్ అధికారులకు ఫోన్ చేయాలని జైపూర్ ఎస్ఐ భూమేష్ సూచించారు.












