సింగరేణి గనులలో కార్మికులకు సరైన రక్షణ పరికరాలు అందించడం లేదని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. రామకృష్ణాపూర్ సిహెచ్పి, ఆర్కేపీ సివిల్, ఏరియా ఆసుపత్రి వద్ద మెమోరాండం అందజేశారు. సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికుల సమస్యలను ప్రస్తావించారు.
గనులలో పనిచేస్తున్న కార్మికులు డ్రిల్ బిట్స్, బూట్లు, హెల్మెట్లు, కీలక పనిముట్లు వంటి రక్షణ పరికరాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ అన్నారు. యూనియన్‌గా స్థానిక జీఎం దృష్టికి తీసుకెళ్లగా, చాలా వరకు అందిస్తున్నామని, అయితే అధిక ధరల భారం అవుతోందని ఆయన చెబుతున్నారని తెలిపారు. సంస్థ లాభాలు వస్తున్నాయని చూపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 60 వేల కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయడం లేదని ఆయన విమర్శించారు. ఈ బకాయిలు సకాలంలో వసూలు చేస్తే కొత్త గనులు ప్రారంభించవచ్చని, అన్ని రకాల రక్షణ పరికరాలు కొరత తీరుతుందని, కార్మికుల సంక్షేమం మెరుగుపడుతుందని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదని, సింగరేణి యాజమాన్యం కూడా వాటిని అడగడం లేదని అక్బర్ ఆలీ ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని కోరితే లాభాలు రావాలని అంటారని, వారు కష్టజీవులు కాదా అని ప్రశ్నించారు. కొత్త ఓపెన్ కాస్ట్ గనులు ప్రారంభించడానికి నిధులు అవసరమని, కేకే ఓపెన్ కాస్ట్ గనిలో ఉన్న షవెల్ను రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనిలోకి తరలించడం వంటి చర్యలు సరికాదని అన్నారు. ప్రభుత్వం కోల్ ఇండియా నుండి బొగ్గు కొనుగోలు చేస్తామని చెబుతోందని, డబ్బు చెల్లించకుండా ఎక్కడా బొగ్గు లభించదని ఆయన గుర్తు చేశారు. ఈ నెల నుండి మూడు నెలల బోనస్, దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్, లాభాల వాటా వంటివన్నీ కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని వడ్డీలు చెల్లించే బదులు, ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించారు. పండగ సమయంలో కార్మికులకు అన్ని చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని కోరారు. సంస్థ లాభాలలో 40 వాటా కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు సరిగా పనిచేయడం లేదని వారిని అప్రతిష్టపాలు చేయకుండా, వారికి అవసరమైన అన్ని రక్షణ పరికరాలు, పనిముట్లు అందించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈసారి రూ. 20,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎంపీటీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉంటుందని, దీనికి కార్మికులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. సీఎంపీటీ చిట్టీలు ఇవ్వడం లేదని, పెన్షన్ ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, సీఎంపీటీ అధికారిని అడిగితే, కంపెనీ డబ్బు పంపడం లేదని చెబుతున్నారని తెలిపారు. అన్ని సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, సిహెచ్పి పిట్ సెక్రటరీ హరి రామకృష్ణ, సివిల్ పిట్ సెక్రటరీ ముకుంద రెడ్డి, ఏరియా ఆసుపత్రి పిట్ సెక్రటరీ శ్రీధర్, పిట్ కమిటీ సభ్యులు సీతారామారావు, సిరాజుద్దీన్, విజయ్ కుమార్, శ్రీధర్, శ్రీనివాస్, నరేంద్ర రెడ్డి, కుంభం శ్రీనివాస్, కోటేశ్వరరావు, మల్లమ్మతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.












