కార్మికులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన కార్మిక పక్షపాతి, సామాజిక సేవకుడు గడ్డం వెంకటస్వామి (కాకా) అని డీసీపీ ఎ.భాస్కర్ అన్నారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకా జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు.
ఈ వేడుకలకు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా కార్మిక శాఖ అధికారి క్రాంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. వారు గడ్డం వెంకటస్వామి (కాకా) చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, గడ్డం వెంకటస్వామి (కాకా) కార్మిక పక్షపాతిగా, దేశ ప్రగతికి కార్మికులే పునాది అనే బలమైన విశ్వాసంతో పనిచేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. కార్మికులకు కేవలం వేతనాలు మాత్రమే కాకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ (శ్రమ గౌరవం) లభించాలనే భావనతో జీవితాంతం కృషి చేశారని తెలిపారు.
సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు విశేషంగా కృషి చేశారని, ప్రతి మనిషి మనుగడకు ఆహారం, దుస్తులు, నివాసం అత్యంత ముఖ్యమైనవని గుర్తించి, పేదలు, గుడిసెల్లో నివసించే ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. జాతీయ గుడిసెల సంఘం ద్వారా గుడిసెల్లో జీవిస్తున్న పేద ప్రజలకు నివాస సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారని, దాదాపు 30 కాలనీలలో ఇళ్ల ఏర్పాటుకు ఆయన చేసిన కృషి పేద ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పును తీసుకువచ్చిందని తెలిపారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అండగా నిలిచి, సామాజిక న్యాయం కోసం గడ్డం వెంకటస్వామి (కాకా) పోరాడారని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా పని చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. దేశంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కాకా వెంకటస్వామి పేర్లు సార్వజనీన సంక్షేమం కోసం చేసిన సేవలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు.
గడ్డం వెంకటస్వామి (కాకా) వారసులు, ప్రస్తుత కాలంలో పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతున్న గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కొత్త చట్టం తీసుకురావడంలో కృషి చేశారని తెలిపారు. కార్మికులు, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా గడ్డం వెంకటస్వామి (కాకా) ఆశయాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.












