మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎటువంటి వేధింపులైనా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాల జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు మహిళా భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పిలుపునిచ్చారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ. ఉషారాణి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మహిళలకు ఎదురయ్యే ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై అవగాహన కల్పించారు. అలాగే, ట్రాఫిక్ నియమాలు, టి-సేఫ్ యాప్, షీ టీమ్స్ సేవల గురించి వివరించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని, ఇందుకోసం డయల్ 100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385లను ఉపయోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
మహిళలు తమకు ఎదురయ్యే వేధింపుల పట్ల భయపడకుండా, ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీమ్ అధికారులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రత కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.












