ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, ఈ ప్రక్రియలో అధికారుల సమన్వయం కీలకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించిన ఆయన, పలువురి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు లతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ భూముల కబ్జా, ఇంటి రిజిస్ట్రేషన్లలో అక్రమాలు, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, మిషన్ భగీరథ నీటి సరఫరా, పారిశుధ్య సమస్యలు, ఇళ్ల మంజూరు వంటి వివిధ అంశాలపై అర్జీలు అందాయి.
ఈ సందర్భంగా, బెల్లంపల్లి డివిజన్ లోని ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్, దరఖాస్తులను 30 రోజులలోపు పరిష్కరించాలని, లేని పక్షంలో తిరస్కరణకు గల కారణాలను తెలియజేయాలని ఆదేశించారు. దరఖాస్తుల వివరాలను పోర్టల్ లో నమోదు చేసి, అర్జీదారులకు రసీదు అందించాలని, వారు తమ దరఖాస్తు స్థితిని ఆన్లైన్ లో తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణికి వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, కుర్చీలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అనంతరం మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయంలో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమ తీరును పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ నొక్కి చెప్పారు.








