బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు.
చెక్‌పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆయన ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సిబ్బంది ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.
పండుగ సమయంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారితో పాటు చెన్నూర్ సిఐ. బన్సీలాల్, కోటపల్లి ఎస్ఐ. రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.








