ఎల్.పి.జి. గ్యాస్ రాయితీని నిరంతరాయంగా పొందాలనుకునే వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని, అలాగే రేషన్ కార్డుదారులందరూ ఈ-కెవైసి పూర్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ (DBTL-PAHAL) పథకం ద్వారా గ్యాస్ రాయితీని పొందడానికి, ఎల్.పి.జి. వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో (OMCs) కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయని వినియోగదారులు ఈ నెల 30వ తేదీ లోపు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు. గడువులోగా అనుసంధానం చేయని వారికి రాయితీ జమ కావడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని, అయితే ఎల్.పి.జి. రీఫిల్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
మరోవైపు, జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ-కెవైసి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ ఈ-కెవైసి పూర్తి చేయడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
ఈ-కెవైసి ప్రక్రియ ద్వారా రేషన్ కార్డులోని సభ్యుల పారదర్శకతను నిర్ధారించడం, నకిలీలను నిరోధించడం, అర్హత కోల్పోయిన వారిని గుర్తించి రికార్డులను నవీకరించడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఇప్పటివరకు ఈ-కెవైసి చేయించుకోనివారు తమ సమీపంలోని రేషన్ దుకాణాలను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన e-POS యంత్రం ద్వారా వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించారు.











