భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
గురువారం భీమారం మండలంలోని అటవీ ప్రాంతంలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, డి.సి.పి. ఎ. భాస్కర్, జైపూర్ ఎ.సి.పి. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, తహసిల్దార్ సదానందం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్, అటవీ డివిజనల్ అధికారి సర్వేశ్వర్, సర్పంచ్ విజయలక్ష్మి లతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో కృషి చేసి మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటడం జరిగిందని, 2026 వనమహోత్సవంలో జిల్లాకు కేటాయించిన 41 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నర్సరీలలోని మొక్కల వివరాలు, ప్లాంటేషన్ సైట్ల రిజిస్ట్రేషన్, సంబంధిత వివరాలను కేటాయించబడిన ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని, మొక్కలు నాటిన తర్వాత జియో ట్యాగింగ్ పూర్తి చేసి, రోజువారీగా వివరాలను నవీకరించాలని కలెక్టర్ సూచించారు. రహదారులకు ఇరుప్రక్కల పెద్ద చెట్లు నాటాలని, నాటిన ప్రతి ఒక్క మొక్క ఎదిగేలా సంరక్షణ చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలల ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు నాటాలని ఆయన తెలిపారు.
జిల్లాలో గనులు దృష్ట్యా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటడం ద్వారా ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












