రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంగళవారం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు వివరాలపై సీఐ హనుక్తో చర్చించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంగళవారం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను, దర్యాప్తు పురోగతిని రూరల్ సీఐ హనుక్ను అడిగి తెలుసుకున్నారు.
సర్కిల్ పరిధిలో నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల నమోదు తీరు, పెండింగ్ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతికి సంబంధించిన ఫైళ్లను సీపీ సమీక్షించారు. విచారణ, దర్యాప్తు సమయంలో భౌతిక, సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు.
పోలీసు విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సీపీ సూచించారు. గ్రేవ్ కేసుల్లో జాప్యం లేకుండా నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించారు. నేరాల నియంత్రణ, దొంగతనాల నిర్మూలన కోసం తనిఖీలు నిర్వహించాలని, పటిష్టమైన పెట్రోలింగ్ అవసరమని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి, ఫిర్యాదుదారులకు భద్రత, భరోసా కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.











