తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక చొరవతో ఈ వేడుకలు జరిగాయి.
ఈ వేడుకల్లో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. ప్రజలు తమ ఇళ్లలో సురక్షితంగా, ప్రశాంతంగా పండుగలను జరుపుకోవడానికి పోలీస్ శాఖ అందిస్తున్న నిరంతర భద్రతే ప్రధాన కారణమని సీపీ అంబర్ కిషోర్ ఝా ఈ సందర్భంగా పేర్కొన్నారు. పండుగల సమయంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ సిబ్బంది రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజున మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉండాల్సి వస్తుందని, దీంతో వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు.
ఈ నేపథ్యంలో, మహిళా పోలీసులకు పండుగ ఆనందాన్ని పంచేందుకు ముందుగానే ప్రత్యేకంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించినట్లు సీపీ తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రజల భద్రతకు నిరంతరం ప్రాధాన్యత ఇస్తూనే, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగల స్ఫూర్తిని ఆనందంగా జరుపుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పాటలు, ఆటపాటలతో కమిషనరేట్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా సాగాయి.












