దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని చారిత్రక గాంధారిఖిల్లాపై తొలిసారిగా ఏర్పాటు చేసిన పంచలోహ దుర్గామాత విగ్రహానికి క్యాతనపల్లి మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని చారిత్రక గాంధారిఖిల్లాపై తొలిసారిగా ఏర్పాటు చేసిన పంచలోహ దుర్గామాత విగ్రహానికి క్యాతనపల్లి మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి బోనాలతో ఊరేగింపుగా గాంధారిఖిల్లాకు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన గాంధారిఖిల్లాకు ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని, ఇక్కడ తొలిసారిగా పంచలోహ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని వొడ్నాల శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రాంత చారిత్రక వైభవాన్ని, ప్రకృతి అందాలను మరింతగా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గౌరవ రాష్ట్ర మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో గాంధారిఖిల్లాను ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు రావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత, 9వ వార్డు కౌన్సిలర్ భీమ మల్లేష్, 10వ వార్డు కౌన్సిలర్ వేణంక శ్రీనివాస్, బొక్కలగుట్ట గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు బలికొండ కిషన్, బీఆర్ఎస్ నాయకులు రాజా రమేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు పొలం సత్యనారాయణ, అలుగుల శ్రీలతతో పాటు అధిక సంఖ్యలో మహిళలు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.











