సుల్తానాబాద్, 5 October
పట్టణంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు చేతుల మీదుగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.6.94 కోట్ల బ్యాంకు లింకేజి రుణాల చెక్కులను అందజేశారు.
పట్టణ కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో సోమవారం రోజున ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు స్థానిక నాయకులతో కలిసి పట్టణ మహిళామణులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మహిళా సంఘాల వారికి బ్యాంకు లింకేజి రుణాల కింద రూ.6.94 కోట్ల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోందని, గత ప్రభుత్వాల హయాంలో మహిళల అభివృద్ధి శూన్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మహిళలను కోటీశ్వరులను చేయాలనే గట్టి సంకల్పంతో ముందుకు వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు.
జిల్లా కేంద్రంలో మహిళా సోదరీమణుల సౌకర్యార్థం రూ. 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పూర్తయిందని, భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని పేర్కొన్నారు.
మహిళామణులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా, మొన్న శనివారం మండలం భూపతిపూర్ గ్రామంలో స్వశక్తి మహిళా సంఘాల మహిళలు నడుపుతున్న జిల్లా చైతన్య పెట్రోల్ పంపును ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే, పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ బస్సులు, ఇందిరా మహిళా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
మహిళల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే దిశగా నాణ్యమైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, మార్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.












