పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, భూ సమస్యలు, రీ-సర్వే ప్రక్రియ, భూ భారతి దరఖాస్తులపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో కలిసి అన్ని మండలాల తహసిల్దార్లు, ఉపతహసిల్దార్లు, మండల సర్వేయర్లతో రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ అంశాలు, పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యల పరిష్కారం, భూ రీ-సర్వే ప్రక్రియ, భూ భారతి దరఖాస్తులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా వచ్చిన పెండింగ్ దరఖాస్తులను మండల, ఆర్.డి.ఓ., మున్సిపల్ కార్పొరేషన్ తదితర స్థాయిలలో పరిశీలించి, జిల్లా స్థాయిలో పరిష్కరించవలసిన అంశాలను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు. మీ సేవా పోర్టల్‌లో భూ సంబంధిత డాక్యుమెంట్ల అప్డేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 81 గ్రామాలలో నిర్వహిస్తున్న రీ-సర్వే ప్రక్రియను ప్రామాణిక నిర్వహణ విధానం ప్రకారం కొనసాగించాలని, రీ-సర్వేకు సంబంధించిన సర్వే రికార్డులు, మ్యాపులు, టీపన్లు, షెడ్యూల్, సమావేశాల మినిట్స్, ప్రొసీడింగ్స్ తదితర రికార్డులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అన్ని మండలాల తహసిల్దార్లు, సర్వేయర్లు నిర్దేశిత ఎస్.ఓ.పి.ను తప్పనిసరిగా పాటించాలని, రోవర్, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ల ఆధారంగా సర్వేను శాస్త్రీయంగా నిర్వహించాలని సూచించారు. ఫారం-9, ఫారం-10 నోటీసులు, సరిహద్దుల నిర్ధారణ, భూ సర్వే తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని, రీ-సర్వే ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పిస్తూ, గ్రౌండ్ ట్రూతింగ్ కార్యక్రమాన్ని పహాణీలు, భూ యాజమాన్య పత్రాలు, ఈ-ల్యాండ్ డాక్యుమెంట్ల సహకారంతో నిర్వహించాలని సూచించారు. గ్రౌండ్ ట్రూతింగ్లో గుర్తించిన సమస్యలను సంబంధిత తహసిల్దార్ స్థాయిలో పరిష్కరించి, ఫామ్ ద్వారా క్లెయిమ్స్, అభ్యంతరాలు, అప్పీళ్లను నిబంధనల ప్రకారం స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. రీ-సర్వేలో అభ్యంతరాల పరిష్కారం, ఫీల్డ్ వాలిడేషన్, సర్వే నిర్ధారణ తదితర అంశాలను సంబంధిత అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని, నోటిఫై చేసిన గ్రామాల జాబితా, సర్వే బృందాల ఉత్తర్వులు, సంప్రదింపు నంబర్లు, రోజువారీ లక్ష్యాలు, అవసరమైన పరికరాలు, ప్రభుత్వ భూములు/భూ రికార్డులు, తాజా పహాణీలు, సంబంధిత ఫారాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సాదాబైనామా పెండెన్సీపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించి, ఆమోదించినవి, తిరస్కరించినవి, తిరస్కరణకు గల కారణాలు, అందిన దరఖాస్తుల సంఖ్య తదితర వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, గ్రామాల వారీగా రైతుల వివరాలు, భూమి వివరాలు, దరఖాస్తుల స్థితిగతులతో కూడిన అబ్‌స్ట్రాక్ట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 22-కు సంబంధించిన సమస్యలపై జిల్లా స్థాయిలో పరిష్కరించిన అంశాలు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, వాటి ప్రస్తుత స్థితిగతులతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. 2025కు ముందు, 2025 తర్వాత నమోదైన కేసుల వివరాలను వేర్వేరుగా పరిశీలించి, వ్యవసాయ భూముల విస్తీర్ణం, రహదారులు, భవనాలు, నిర్మాణాలు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను సరిపోల్చి సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూ భారతి దరఖాస్తులను నియోజకవర్గాల వారీగా గుర్తించి, వాటి పరిష్కార స్థితి, పెండింగ్‌కు గల కారణాలను నమోదు చేయాలని, పెండింగ్ దరఖాస్తులను క్రమబద్ధంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ సరిహద్దు వివాదాలను మండలాల వారీగా గుర్తించి, ప్రస్తుతం ఉన్న కేసులు, కోర్టు కేసులు, ముఖ్యమైన/ప్రాధాన్యత కలిగిన కేసుల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వివాదాల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షా కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.












