మంచేరియల్, June 28, 2026
జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో రూ. 1.34 కోట్లతో నిర్మించిన బాలసదనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ బాలసదనంలో 60 మంది పిల్లలకు వసతి, భోజనం, విద్య, వైద్యం, కౌన్సిలింగ్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు.
బాలసదనంలో పిల్లలకు అవసరమైన వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బాలసదనం భవనాన్ని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకంలో 1.34 కోట్ల రూపాయల వ్యయంతో బాలసదనం భవన నిర్మాణం చేపట్టి, అతి తక్కువ సమయంలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. బాలసదనంలో 60 మంది పిల్లలకు అవసరమైన సౌకర్యాలు, ఫర్నిచర్, వసతి గదులు, మూత్రశాలలు ఇతరత్రా కల్పించడం జరిగిందని, వాచ్మెన్, వంట మనిషి, ఇతర సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.
బాలసదనంలో వసతి పొందుతూ అర్హత గల బాలికలను కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు పంపించి విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. బాల్యవివాహాల బాధితులు, లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, అనాధలు, నిరాశ్రయులు, సంరక్షణ అవసరం ఉన్న పిల్లలకు సురక్షిత ఆశ్రయం కల్పించడం జరుగుతుందని, సంరక్షణ, విద్య, వైద్య సేవలు, కౌన్సిలింగ్, పునరావాస సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.
మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ అనాధలు, నిరుపేద పిల్లల సౌకర్యం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలసదనం ఏర్పాటు చేయడం జరిగిందని, పిల్లలకు ఎల్లప్పుడూ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ వారి పోషణ చూడడం జరుగుతుందని తెలిపారు. బాలికలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, బాలసదనం పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం అందరి సమిష్టి కృషితోనే సాధ్యపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ సమితి అధికారులు, బాలసదనం నిర్వాహకులు, సంబంధిత అధికారులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.











