మంచేరియల్, 08.07.2026
సింగరేణి సంస్థ హక్కుల పరిరక్షణ కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, తాడిచెర్ల కోల్ బ్లాక్–2 కేటాయింపు సింగరేణి సంస్థకే కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా కీలకమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీ కృష్ణ గడ్డం తెలిపారు. ఈ కేటాయింపు సింగరేణి కార్మికుల పోరాటానికి దక్కిన విజయమని ఆయన పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ హక్కుల పరిరక్షణ కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీ కృష్ణ గడ్డం తెలిపారు. సింగరేణి సంస్థకు హక్కుగా రావాల్సిన కోల్ బ్లాక్‌ల కేటాయింపుపై గత రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామితో కలిసి సింగరేణి సంస్థకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పామని, సింగరేణి ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాడతామని హామీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారిని పలుమార్లు కలిసి తాడిచెర్ల కోల్ బ్లాక్–2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని, అదే అంశంపై పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తి సింగరేణి కార్మికుల గొంతుకగా నిలిచామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్–2ను సింగరేణికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వంశీ కృష్ణ గడ్డం, ఇది సింగరేణి సంస్థకే కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా కీలకమైన నిర్ణయమని అన్నారు. ఈ కేటాయింపుతో సింగరేణి సంస్థ బలోపేతం కావడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు.
"ఇది కేవలం కోల్ బ్లాక్ కేటాయింపు మాత్రమే కాదు... సింగరేణి కార్మికుల పోరాటానికి దక్కిన విజయం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు లభించిన గౌరవం. సింగరేణి హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం మా పోరాటం భవిష్యత్తులో కూడా ఇదే నిబద్ధతతో కొనసాగుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.












