సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సి&ఎండి) డా. బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్ గురువారం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న 1x800 మెగావాట్ల మూడో యూనిట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్లాంట్‌కు చేరుకున్న సి&ఎండికి ఎస్టిపిపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. చిరంజీవి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్లాంట్ ఆవరణలో సి&ఎండి స్వయంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ పోలీసు బృందం గౌరవ వందనం సమర్పించింది.
మూడో యూనిట్ నిర్మాణ ప్రాంతాన్ని కలియతిరిగిన సి&ఎండి, బీహెచ్ఈఎల్, కెపిసి, పవర్‌మెక్ ఏజెన్సీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతలో రాజీ పడవద్దని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎం.వి. వేణుగోపాల్ యూనిట్ పురోగతిని ప్లానింగ్ డయాగ్రమ్ ద్వారా వివరించారు.
అనంతరం నూతనంగా నిర్మించిన సేఫ్టీ కంట్రోల్ రూమ్‌ను సి&ఎండి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మెయిన్ కంట్రోల్ రూమ్‌లో 1, 2 యూనిట్ల ద్వారా జరుగుతున్న 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తీరును ఇంజనీర్లు వివరించారు. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, బాయిలర్ పనితీరుపై ఆరా తీశారు. పర్యావరణ నిబంధనల మేరకు నిర్మిస్తున్న ఎఫ్జిడి ప్లాంట్ పనులను కూడా పరిశీలించారు.
పరిపాలన భవనంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో సి&ఎండి మాట్లాడుతూ, "800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. ఇదే స్ఫూర్తితో పనులు పూర్తిచేసి, రాష్ట్రానికి అదనపు విద్యుత్ అందించాలి" అని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో పలువురు డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.









