మంచేరియల్, 2026-07-21
జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, పరిశుభ్రమైన వసతులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని పలు విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి సౌకర్యాలను, విద్యాబోధనను సమీక్షించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, పరిశుభ్రమైన వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామపంచాయతీ, లక్షెట్టిపేట, దండేపల్లి మండలం కర్ణపేట గ్రామాల్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలల పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, వసతి, భోజనశాల, వంటశాల, త్రాగునీటి వసతులు, విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యత, విద్యాబోధన, హాజరు రిజిస్టర్లు వంటి పలు అంశాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ, అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తోందని తెలిపారు.
విద్యార్థులతో మాట్లాడి బోధన, వసతులు, భోజన నాణ్యత, వసతిగృహ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంపుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పాఠశాలలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, స్కూల్ కాంప్లెక్స్ వంటి పనులను వేగవంతంగా పూర్తి చేసి, త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, వసతి గృహాలు, గ్రామాలలో పరిశుభ్రతను కట్టుదిట్టంగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. త్రాగునీటి పైప్లైన్లలో లీకేజీలు లేకుండా చూసి, క్లోరినేషన్ చేసిన సురక్షిత నీటిని ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
హాజీపూర్ మండల కర్ణమామిడి గ్రామపంచాయతీని సందర్శించి, గ్రామంలో మురుగు కాలువల నిర్వహణ, పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో కూలిపోయే ప్రమాదంలో ఉన్న, శిథిలావస్తలో ఉన్న ఇళ్లను గుర్తించి, అవసరమైతే ఆయా కుటుంబాలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లక్షెట్పేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం సందర్శనలో పాఠశాల పరిసర ప్రాంతాలలో వీధిదీపాలు పనిచేయడం లేదని గుర్తించి, సంబంధిత విద్యుత్ శాఖ అధికారిని పిలిపించి వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ కమిషనర్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.












