మంచేరియల్, July 4, 2026
2026-2027 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టిజిఎస్డబ్ల్యుఆర్ఐఈఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గ్రూపులలో మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు టిజిఎస్డబ్ల్యుఆర్ఐఈఎస్ సమన్వయకర్త రామ కళ్యాణి తెలిపారు. ఈ నెల 6న లక్షెట్టిపేట, జైపూర్లలో కౌన్సిలింగ్ జరగనుంది.
2026-2027 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టిజిఎస్డబ్ల్యుఆర్ఐఈఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గ్రూపులలో మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు టిజిఎస్డబ్ల్యుఆర్ఐఈఎస్ సమన్వయకర్త రామ కళ్యాణి తెలిపారు.
జిల్లాలోని బాలుర (బెల్లంపల్లి, సిఓఈ జైపూర్, మంచిర్యాల, కాసిపేట), బాలికల (లక్షెట్టిపేట, చెన్నూర్, మందమర్రి, బెల్లంపల్లి) జూనియర్ కళాశాలల్లో అతి కొద్ది ఖాళీలున్నాయి. వీటిని బాలికలతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బాలికలకు లక్షెట్టిపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో, బాలురకు జైపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఈ నెల 6వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
అర్హత కలిగిన బాలికలు ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు లక్షెట్టిపేటలో, బాలురు జైపూర్ లో తమ అర్హతలను తెలిపే ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి నకలు ప్రతులతో హాజరుకావాలి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్, మధ్యాహ్నం 1 గంట తర్వాత మెరిట్ జాబితా ప్రకటన, 2 గంటల తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయించిన జాబితాను ప్రకటించడం జరుగుతుంది.
రాష్ట్రంలో మార్చి, 2026లో నిర్వహించిన పరీక్షలలో ఒకే ప్రయత్నంలో ఎస్.ఎస్.సి./ సి.బి.ఎస్.ఈ./ ఐ.సి.ఎస్.ఈ. ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, కుల ప్రాతిపదికన అడ్మిషన్లు కల్పించడం జరుగుతుంది. అభ్యర్థులు మంచిర్యాల / ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. 10వ తరగతిలో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలలలో దరఖాస్తు చేసుకోవచ్చు.
కౌన్సెలింగ్ సమయంలో ఒరిజినల్ ఎస్.ఎస్.సి. మార్కుల మెమో ప్రతిని సమర్పించాలి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో 1 లక్ష 50 వేల రూపాయల లోపు ఉండాలి. దీనికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జనవరి 1, 2026 లేదా అంతకు ముందు తేదీలో తహశీల్దార్ జారీ చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31, 2026 నాటికి 17 సంవత్సరాలు మించకూడదు. ఎస్.సి. అభ్యర్థులకు ఒక సంవత్సరం సడలింపు ఉంటుంది.
కేటాయించిన సంస్థలో అడ్మిషన్ పొందే సమయంలో, విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, సంబంధిత తహశీల్దార్ జారీ చేసిన ఒరిజినల్ కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. 2026-27 తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అర్హత పరీక్ష రాసిన బాలబాలికలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది.












