మంచేరియల్, 2026-09-11
ఉపాధ్యాయుల కృషి, అంకితభావంతోనే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఉపాధ్యాయుల కృషి, అంకితభావంతోనే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా మైనారిటీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ లతో కలిసి హాజరై డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెరగడంలో ఉపాధ్యాయుల కృషి కీలకమని, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులలో నమ్మకం పెంపొందించేందుకు ఉపాధ్యాయుల అంకితభావం ప్రధాన కారణమని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో సైతం విద్యార్థుల నమోదును మరింత పెంచడంతో పాటు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు, బోధనలో నాణ్యతను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల లెర్నింగ్ ఔట్కమ్ను పెంచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం ఉపాధ్యాయ వృత్తిలో కీలకమైన బాధ్యత అని తెలిపారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ అదే లక్షణాలను విద్యార్థులలో పెంపొందించాలని, విభిన్న బోధనా పద్ధతులను అనుసరించాలని సూచించారు. సాంకేతికత ఆధారంగా ప్రతి ఒక్కరికీ నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని పాఠశాలలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, వసతి తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తుందని తెలిపారు. జిల్లాలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని, పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ అందించామని, ఎప్పటికప్పుడు నూతన విద్యా విధానాలను, సాంకేతికతను నేర్చుకుంటూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిని నిర్మాణాత్మకంగా స్వీకరించి విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడేలా పని చేయాలని తెలిపారు. మంచిర్యాల జిల్లా విద్యార్థుల నమోదు, ఉత్తీర్ణతలో ముందు వరుసలో ఉండటం ఉపాధ్యాయ వర్గానికే గర్వకారణమని తెలిపారు.












