ఎల్కతుర్తి, 18 November
హనుమకొండ జిల్లా మండలం అనంతసాగర్‌లోని ఎస్సార్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పానుగంటి వినయ్ రెడ్డి (20) అనే యువకుడు మృతి చెందాడు. లారీ ఢీకొని ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనతో దండేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
హనుమకొండ జిల్లా మండలం అనంతసాగర్‌లోని ఎస్సార్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో దండేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రిని కోల్పోయి, కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు అకాల మరణంతో తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం దండేపల్లి గ్రామానికి చెందిన పానుగంటి వినయ్ రెడ్డి (20) గత కొంతకాలంగా మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా అనంతసాగర్ ఎస్సార్ కళాశాల సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినయ్ రెడ్డి పక్కనే ఉన్న కారుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వినయ్ రెడ్డి కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అతని తండ్రి గతంలో కరోనా మహమ్మారి సమయంలో మృతి చెందగా, తల్లి పానుగంటి అనురాధ కూలి పనులు చేస్తూ ఎన్నో కష్టాలు పడి కొడుకును చదివించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో వినయ్ రెడ్డి పెట్రోల్ బంకులో పనిచేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన అనురాధ రోదనలు గ్రామస్తులను కలచివేశాయి. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రావద్దు అంటూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి అండగా నిలిచిన యువకుడు అకాల మరణం చెందడంతో దండేపల్లి గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.







