రామగుండం, 2026-11-21
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకేజీపై ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ, సింగరేణి రెస్క్యూ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ () పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకేజీ సంభవించినప్పుడు చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర రక్షణ, సహాయక చర్యలపై ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ, సింగరేణి రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రమాదకరమైన పారిశ్రామిక ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో, సమర్థవంతంగా స్పందించకపోతే ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది అనుసరించాల్సిన విధానాలు, ప్రమాద తీవ్రతను నియంత్రించడం, బాధితులను సురక్షితంగా రక్షించడం వంటి అంశాలపై క్షేత్రస్థాయి ప్రాక్టికల్ అవగాహన కల్పించడమే మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వివిధ విభాగాల సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. అలాగే భద్రతా ఏర్పాట్లలో ఉన్న లోపాలను ముందుగానే గుర్తించి, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు.
స్థానిక పోలీస్ యంత్రాంగం, పరిశ్రమల భద్రతా విభాగాలు, రెస్క్యూ బృందాలు, ప్రాజెక్టు నిర్వహణ సిబ్బంది మధ్య పరస్పర సమన్వయం మరింత బలోపేతం కావడానికి ఇటువంటి మాక్ డ్రిల్స్ ఎంతగానో దోహదపడతాయని సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, సంసిద్ధంగా ఉండాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ఎన్టీపీసీ ఎస్ఐలు వెంకట స్వామి, స్రవంతి, ఆర్ఎఫ్సీఎల్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఎన్టీపీసీ అధికారులు, రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు.


