మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా షీ టీమ్స్ ఆధ్వర్యంలో సీసీసీ నస్పూర్ నాగర్జున కాలనీ వద్ద సింగరేణి పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ హైమ పాల్గొన్నారు.
జిల్లా షీ టీమ్ ఎస్ఐ హైమ ఆదేశాల మేరకు, మహిళల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే విధులకు రోడ్లపైకి వచ్చే మహిళా పారిశుధ్య కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సదస్సును నిర్వహించినట్లు షీ టీమ్ సిబ్బంది తెలిపారు. మహిళలు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా, రక్షణగా షీ టీమ్స్ ఎల్లప్పుడూ ఉన్నాయని వారు భరోసా ఇచ్చారు. మహిళలకు చట్టపరంగా కల్పించిన హక్కులు, వేధింపుల నుంచి ఎలా రక్షణ పొందాలనే విషయాలపై కార్మికులకు వివరించారు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, షీ టీమ్స్ విధులు, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియజేస్తూ, డయల్-112, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385 లను వివరించారు.
సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని షీ టీమ్ సిబ్బంది భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన చర్యలు చేపడుతోందని, మహిళలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షీ టీమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు శ్రావణ్ కుమార్, సతీష్, సూపర్వైజర్ రవి మరియు సింగరేణి పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.












