ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. జి.ఓ. నం. 59, 76 అమలుపై ప్రత్యేకంగా చర్చించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి. రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో పాటు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ, సింగరేణి భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న నిబంధనలు, అర్హతలు, గడువులకు అనుగుణంగా ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్దేశిత కటాఫ్ తేదీకి ముందు జరిగిన ఆక్రమణలకు మాత్రమే, జి.ఓ. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న సందర్భాలలోనే క్రమబద్ధీకరణ చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భూముల క్రమబద్ధీకరణకు ముందు, సంబంధిత భూమి అటవీ భూముల పరిధిలోకి వస్తుందా లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, అటవీ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అన్ని అంశాలను నిర్ధారించిన అనంతరమే తదుపరి చర్యలు చేపట్టాలని తెలిపారు. జి.ఓ. నం. 59 ప్రకారం 500 చదరపు గజాల లోపు విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలు, అర్హతలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. జి.ఓ. నం. 76కు సంబంధించి తహసిల్దార్లు, సింగరేణి అధికారుల సమన్వయంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు.
సింగరేణి ఉద్యోగులు కానివారు సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్నట్లయితే, నిబంధనల ప్రకారం వాటిని ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సింగరేణి నిర్మాణాలలో నివాసం ఉంటున్న వారికి సంబంధిత మున్సిపాలిటీల ద్వారా ఆస్తి పన్ను విధించడం, ఇంటి నంబర్లు కేటాయించడం వంటి అంశాలను పరిశీలించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి చర్యలు జరిగినట్లు గుర్తిస్తే, సంబంధిత మున్సిపల్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల క్రమబద్ధీకరణలో పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సింగరేణి అధికారులు, తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.












