మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రరూపం దాల్చుతోంది. వందల సంఖ్యలో కోతులు ఇళ్ల చుట్టూ సంచరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కోతుల భయంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
ఇటీవల కాలేజీ రోడ్లో ఓ వ్యక్తిపై కోతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడికి నాలుగు కుట్లు వేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది. చిన్నారులు, వృద్ధులు రోడ్లపైకి వెళ్లాలంటే భయపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
కాలేజీ రోడ్ ప్రాంతంలో కోతుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడులతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తక్షణ చర్యలు చేపట్టాలి: కార్పొరేటర్ కస్తూరి నాగరాజు
ఈ సందర్భంగా 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు మాట్లాడుతూ, కాలేజీ రోడ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. కోతులు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నప్పటికీ సమస్య పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కోతుల సమస్యపై కార్పొరేషన్ పాలకవర్గం వెంటనే స్పందించాలని, కోతుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించి కాలేజీ రోడ్ ప్రజలకు కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరారు.












