మంచిర్యాల జిల్లాలో బియ్యం విక్రయదారులు తమ దుకాణాలలో వివిధ రకాల బియ్యం గరిష్ట విక్రయ ధరలను ప్రజలకు కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ ఆదేశించారు. శనివారం ఆయన అధికారులతో కలిసి పలు బియ్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారి తెలిపారు. విక్రయ కేంద్రాలలో ధరల వివరాలను తెలిపే ఫ్లెక్సీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. బిపిటి బియ్యం కిలోకు 66 రూపాయలు, తెలంగాణ సోనా / హెచ్ఎంటి బియ్యం కిలోకు 74 రూపాయలు, జైశ్రీరామ్ బియ్యం కిలోకు 79 రూపాయలకు మించి విక్రయించరాదని ఆయన స్పష్టం చేశారు. హోల్సేల్ వ్యాపారులు, కిరాణా వర్తకులు, మిల్లర్లు, బియ్యం విక్రయదారులు ఈ ధరలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వినియోగదారులకు ధరలపై స్పష్టమైన అవగాహన కల్పించేలా విక్రయ కేంద్రాలలో ధరల పట్టికలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలను ఉల్లంఘించి అధిక ధరలకు బియ్యం విక్రయించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం-1955 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












