వయోవృద్ధుల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం2026 ను పురస్కరించుకొని వయోవృద్ధుల సంక్షేమం, సాధికారత వారోత్సవాలను పురస్కరించుకుని నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు.
శనివారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ఈ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. వారోత్సవాలలో భాగంగా వయోవృద్ధుల ఆరోగ్యం, భద్రత, డిజిటల్ అవగాహన, సామాజిక అనుసంధానం, చట్టపరమైన హక్కులు, సంక్షేమం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 28న సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత, వయోవృద్ధులపై వేధింపుల నుంచి రక్షణపై అవగాహన, 29న తరతరాల మధ్య అనుబంధం, పరస్పర అభ్యాసం కార్యక్రమాలు, 30న చురుకైన వృద్ధాప్యం, ఆరోగ్య పరిరక్షణ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం2007, నియమాలు2011 ప్రకారం వయోవృద్ధులకు అందుబాటులో ఉన్న హక్కులు, రక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, వయోవృద్ధులపై నిర్లక్ష్యం, వేధింపులు, ఇతర సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం, రక్షణకు సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్ 14567 కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని, పోలీస్ హెల్ప్‌లైన్ 100ను సంప్రదించవచ్చని తెలిపారు.
వయోవృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ గౌరవం, భద్రత, సహకారం అందిస్తూ వారి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవనానికి తోడ్పడాలని కలెక్టర్ సూచించారు. శనివారం వృద్ధాప్య గృహాల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలలో భాగంగా జిల్లాలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో ఉచిత మెగా శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వైద్య శిబిరంలో వయోవృద్ధులకు బి.పి., షుగర్, కంటి పరీక్షలు, ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించడం జరిగిందని, వయస్సుతో వచ్చే కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలపై వైద్యులు కౌన్సెలింగ్ అందించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.










