కల్యాణిఖనిలోని సింగరేణి హైస్కూల్లో రామకృష్ణాపూర్ ప్రాంతీయ ఆసుపత్రి ఆధ్వర్యంలో 12/12 అనీమియా (రక్తహీనత) స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్‌కుమార్, జీఎం శ్రీ రాధాకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపూర్ డివైసీఎంఓ (అడ్మిన్) డాక్టర్ మధుకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పీడియాట్రిషియన్ డాక్టర్ శైలజ విద్యార్థులకు అనీమియా స్క్రీనింగ్ ప్రాముఖ్యత, నివారణ చర్యలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో అనీమియాను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా తగిన ఆరోగ్య సూచనలు, వైద్య సేవలు అందించవచ్చని వైద్యులు తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ పోషక విలువలు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవాలని, ఐరన్, ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చని వివరించారు. భోజనాన్ని సమయానికి తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
అనంతరం విద్యార్థులకు అనీమియా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన విద్యార్థులకు తదుపరి వైద్యపరమైన సూచనలు అందించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి సారించి, మంచి ప్రతిభ కనబరచగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీ పురుషోత్తం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపూర్ వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.












