ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, సకల సదుపాయాలు అందించే దిశగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని పలు విద్యా, సంక్షేమ సంస్థలను సందర్శించి పలు సూచనలు చేశారు.
చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని, వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం కోటపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మండల తహసిల్దార్ రాఘవేంద్రతో కలిసి సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. షెడ్యూల్డ్ కులముల సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించి, శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో నూతన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.
తెలంగాణ ఆదర్శ పాఠశాల, బాలికల వసతి గృహాన్ని సందర్శించి, విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. మండలంలోని నక్కలపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా చేపట్టిన హియరింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అర్హత గల ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో స్పష్టంగా ఉండేలా జాబితా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

