మంచిర్యాల పట్టణంలోని గాయత్రి మాత కాలనీలో శ్రీ గాయత్రి మాత గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. నవరాత్రి ఉత్సవాల చివరి రోజున కాలనీలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గాయత్రి మాత కాలనీలోని చిన్నారులందరికీ సరస్వతీదేవి పూజ నిర్వహించి, వారికి విద్యాబుద్ధులు, జ్ఞానం, విజ్ఞానం ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రముఖ వేద పండితులు, మహా యాగ్నికులు, చండీ ఉపాసకులు శ్రీరాం బట్ల కార్తీక్ శర్మ గారి ఆధ్వర్యంలో చిన్నారులకు సరస్వతీ పూజ చేయించి, ఆశీర్వాదాలు అందించారు.
అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో ఏకహారతి, బిల్వహారతి, పంచహారతి, కుంభహారతి, నక్షత్రహారతి వంటి విశిష్ట హారతులను నిర్వహించారు. ఈ మహా హారతి కార్యక్రమంలో శ్రీరాం బట్ల సుహాస్ శర్మ పాల్గొని, మహిళలకు ఆశీర్వాదాలు అందించారు.
ఈ సందర్భంగా గాయత్రి మాత కాలనీ కుటుంబ సభ్యులు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు.
వెళ్లిరా గణపయ్య... మళ్లీరా గణపయ్య... మా కోరికలను తీర్చు తండ్రి అంటూ భక్తులు గణనాథుని మనసారా వేడుకున్నారు. కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు.
శ్రీ గాయత్రి మాత గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలు కాలనీ ప్రజలలో భక్తిభావాన్ని, ఐక్యతను చాటుతూ విజయవంతంగా ముగిశాయి.











